భారత సైన్యం లో అత్యున్నత పదవి అయిన ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో 2026 జూన్ 30 నుంచి ధీరజ్ సేథ్ భారత సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయన పదవీకాలం ఆగస్టు 31 2028 వరకు కొనసాగనుంది. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న ధీరజ్ సేథ్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సైనిక సేవా అనుభవం ఉంది. ఖడక్‌వాస్లాలోని జాతీయ రక్షణ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన ఆయన 1986లో ఆర్మర్డ్ కార్ప్స్ అధికారిగా భారత సైన్యంలో చేరారు. అప్పటి నుంచి వివిధ కీలక కమాండ్, స్టాఫ్, వ్యూహాత్మక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. సైనిక విద్యలోనూ ఆయనకు విశేష అనుభవం ఉంది. ఫ్రాన్స్‌లోని పారిస్ మిలిటరీ కాలేజీలో డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కోర్సు పూర్తిచేశారు.

































