ఇరాన్‌పై అమెరికా భీకరంగా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. విధ్వంసకర పేలుడు పదార్ధాలు, క్షిపణులను ఆ దేశం వినియోగిస్తున్నది. చాలా ఖరీదైన ఆ ఆయుధాల వల్ల, అమెరికా అనూహ్య రీతిలో యుద్ధం కోసం ఖర్చు చేస్తున్నది. ఇరాన్ వార్ కోసం అమెరికా ఖర్చు చేస్తున్న గణాంకాలను పరిశీలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇరాన్ వార్ కోసం ప్రతి సెకనుకు అమెరికా సుమారు 9.8 లక్షలు(10వేల డాలర్లు) ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం యుద్ధం 31వ రోజుకు చేరుకున్నది. అమెరికా పన్నుదారులకు చెందిన సుమారు 2.63 లక్షల కోట్లు ఇప్పటి వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన యుద్ధం ప్రస్తుతం భీకర స్థాయికి చేరుకున్నది.
ఈ యుద్ధం కోసం ప్రతి రోజు అమెరికా ప్రభుత్వం దాదాపు 8455 కోట్లు(890 మిలియన్ల డాలర్లు) ఖర్చు చేస్తున్నది. పేలుడు పదార్ధాలు, ఎయిర్ ఆపరేషన్స్, నేవీ డిప్లాయ్‌మెంట్, మిస్సైల్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్, లాజిస్టిక్స్‌తో అన్ని ఖర్చులు లెక్కేస్తున్నారు. ఎస్ఐపీఆర్ఐ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మునిషన్స్, మిస్సైళ్లకు ఎక్కువ ఖర్చు అవుతోంది. ప్రతి రోజు వాటి కోసం సుమారు 3040 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం ఖర్చులో అది 36 శాతంగా ఉంది. తోమాహాక్ క్రూయిజ్ మిస్సైళ్లు, జేడీఏఎం బాంబులు, ప్రిసిషన్ గైడెడ్ బాంబులు ఉన్నాయి.


