అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా చేరుకున్నారు. రాజధాని బీజింగ్‌లో బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ట్రంప్ చైనాలో అడుగుపెట్టారు. రెండు రోజులపాటు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఒకపక్క ఇరాన్‌తో యుద్ధం సాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ అధ్యక్ష హోదాలో చైనాలో పర్యటించడం ఇది రెండోసారి. చివరగా ఆయన 2017లో చైనాలో పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా చైనా–అమెరికాల మధ్య కీలక అంశాలపై చర్చలు, ఒప్పందాలు జరగనున్నాయి. వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, సైనిక, రక్షణ అంశాలతోపాటు తైవాన్ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే, స్టేట్ బాంక్వెట్, టీ రిసెప్షన్ వంటి కార్యక్రమాలకు కూడా ట్రంప్ హాజరవుతారు. చైనా, అమెరికా.. ప్రపంచంలోనే రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు. ఇరు దేశాల మధ్య అనేక అంశాల్లో సహకారంతోపాటు, పలు అంశాల్లో విబేధాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పర్యటనకు ముందు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. తైవాన్, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చైనా రాజకీయ అంశాలు, చైనా అభివృద్ధి హక్కులు వంటి అంశాలపై ఎలాంటి చర్చలు జరపరాదని ప్రకటించింది.


