అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేని అధ్యాయానికి అధ్యక్షుడు ట్రంప్ నాంది పలుకబోతున్నారు. త్వరలో ట్రంప్ సంతకం ఉన్న డాలర్ నోట్లను విడుదల చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు. అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వ్యక్తి సంతకంతో కరెన్సీ నోట్ల ను ముద్రించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కొత్తగా ముంద్రించబోయే అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకంతోపాటు ఆ దేశ ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ సంతకం కూడా ఉండనుంది. ఈ మార్పులతో వచ్చే జూన్‌లో మొదటగా 100 డాలర్ల నోటును విడుదల చేయనున్నట్టు బెసెంట్ తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ట్రంప్ సంతకంతో డాలర్ నోట్లను విడుదల చేస్తాం. ఈ ఏడాది అమెరికా జరుపుకోనున్న 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, దేశ చరిత్రాత్మక విజయాలను స్మరించుకునేందుకు ఇదో అద్భుత మార్గం అని బెసెంట్ చెప్పారు.


