అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ కు గట్టి హెచ్చరిక చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో న్యూఢిల్లీ సహకరించకపోతే, భారతదేశం నుంచి జరిగే దిగుమతులపై అదనపు సుంకాలు విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సుంకాలను పెంచే అంశంపై కూడా అమెరికా వెనుకాడని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ సర్కారు గత సంవత్సరం భారత వస్తువులపై సుంకాలను 50శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోందన్న కారణాన్ని చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ట్రంప్ రష్యా చమురు సమస్యపై భారత్ సహాయం చేయకపోతే మేం టారిఫ్ లను ఇంకా పెంచవచ్చని హెచ్చరించారు.
అయితే, భారతదేశం ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించిందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. వాళ్లు నన్ను సంతోషపెట్టాలని కోరుకున్నారు. ప్రధాని మోడీ చాలామంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం వారికి ముఖ్యం. వారు వ్యాపారం చేస్తారు, కానీ మేం కావాలంటే చాలావేగంగా సుంకాలను పెంచగలమని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాలన్నీ భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల సమయంలో జరగడం గమనార్హం.


