అమెరికాతో ఆటలు ఆడాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌ను హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధానికి విరామం ప్రకటించినందున శాంతి చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లే ముందు వాన్స్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా వైఖరిని స్పష్టం చేశారు. తమ అధ్యక్షుడి ఆదేశాల మేరుకు దౌత్యపరమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ సమయంలో ఇరాన్ తమతో ఆటలు ఆడాలని చూస్తే సహించబోమని వాన్స్ స్పష్టం చేశారు. ఆరు వారాలుగా క్షిపణుల మోతతో అట్టుడికిన పశ్చిమాసియాలో యుద్ధానికి విరామం ప్రకటించిన అమెరికా టెహ్రాన్‌తో దౌత్యపరమైన చర్చలకు సిద్ధమైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉన్నత స్థాయి బృందంతో కలిసి పాకిస్థాన్ బయల్దేరారు. టెహ్రాన్‌తో చర్చల కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాను అని పాకిస్థాన్‌కు వెళ్లడానికి ముందు వాన్స్ పేర్కొన్నారు.
టెహ్రాన్‌తో దౌత్యపరమైన చర్చల విషయమై అధ్యక్షుడు ట్రంప్ మాకు కీలకమైన సూచనలు చేశారు. ఆయన మాట ప్రకారం ఇరాన్ విశ్వసనీయతతో చర్చలు జరిపితే మేము సానుకూలంగా స్పందిస్తాం. అలా కాకుండా వారు మాతో ఆటలు ఆడాలనుకుంటే మాత్రం చర్చలకు వచ్చిన బృందం వారి మాట అస్సలు వినదు. అయితే, మేము మాత్రం ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు సానుకూలంగా జరగడానికి ప్రయత్నిస్తాం అని వాన్స్ వెల్లడించారు.


