ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు మౌళిక సదుపాయాలు కల్పించి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్రమంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పండ్లు, కూరగాయల హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు బ్యాంకులు సహకరించాలన్నారు. ఆహార అనుబంధ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటు ఇవ్వాలని అన్నారు.
భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్రమంత్రి తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. భూ త్యాగాలు చేసిన రైతులకు ఎలాంటి బ్యాంకింగ్ ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. బ్యాంకు రీజనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయటం కాదని, రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని సూచించారు. బ్యాంకుల ఏర్పాటు ద్వారా ఎన్నో సమస్యలు వేగంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా బ్యాంకర్లు కృషి చేయాలని వెల్లడించారు.


