తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే అదనపు సొలిసిటర్ జనరల్ గా ఆయనను మోదీ సర్కార్ నియమించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పదవికి దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన న్యాయపదవుల్లో ఒక్కటిగా గుర్తింపు ఉంది. కనకమేడల రవీంద్ర కుమార్ నియామకం న్యాయరంగంలో ఆయనకు ఉన్న అనుభవానికి, సామర్థ్యానికి గుర్తింపుగా రాజకీయ, న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ జీవితంతో పాటు న్యాయరంగంలోనూ చురుకైన పాత్ర పోషించిన ఆయనకు ఇప్పుడు దేశస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయ అంశాలపై కనకమేడల రవీంద్ర కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. రాజ్యాంగపరమైన కీలక వివాదాల్లో ప్రభుత్వ వాదనను ఆయన బలంగా వినిపిస్తారని కేంద్రం భావిస్తోంది.

































