తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళా కమిషన్‌కు కొత్త నియామకాలు చేపట్టింది. మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన తెలంగాణ మహిళా కమిషన్‌కు చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అలాగే కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం పలువురు ప్రముఖ మహిళలకు అవకాశం కల్పించింది. ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవ, మహిళా హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను కూడా కమిషన్ సభ్యురాలిగా కాంగ్రెస్ సర్కార్ నియమించింది. మహిళా కమిషన్ సభ్యులుగా శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది.


