తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ జీవో నంబర్ 900ను జారీ చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదికలో బయటపడిన అంశాలు, సిఫార్సులను వివరంగా అధ్యయనం చేయాలని ఆదేశించింది. పాలనాపరంగా అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు, న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సిన అంశాలపై సూచనలు చేయాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏకసభ్య కమిషన్ నివేదికలోని నిర్ణీత కాల వ్యవధిలో అమలు చేయాల్సిన అంశాలను సూచించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ సిఫార్సులను అమలు చేసేందుకు తగిన పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు చేయడం వంటి అంశాలపై కమిటీ సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కమిటీ తన నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించాలని జీవోలో స్పష్టంగా సూచించింది.


