విశాఖపట్నంలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. వన్ గిగా వాట్ సామర్థ్యంతో రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో మెగా డేటా సెంటర్‌ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. డేటా సెంటర్‌కు తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో మొత్తం 600 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అన్ని రకాల అనుమతులను సర్కార్ క్లియర్ చేసింది.
ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే మాట్లాడుతూ గూగుల్ ఇండియా ఏఐ హబ్‌కు చేసిన శంకుస్థాపన 2047 వికసిత్ భారత్‌కు ఓ పునాది రాయి లాంటిదన్నారు. ఏఐ యుగంలో విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లోనూ ఈ డేటా సెంటర్ అత్యంత ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా ఇప్పుడు విశాఖ, ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోందని అన్నారు. ఇంటర్నేషనల్ సబ్ సీ గేట్ వేగా ఉన్న ముంబై, చెన్నైలతో పాటు విశాఖ కూడా కీలకంగా మారిందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు లోకేశ్, అనిత, బాల వీరాంజనేయ స్వామి, సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.


