ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని సుమారు ఏడున్నర గంటల పాటు ఇడి విచారించింది. బషీర్‌బాగ్‌లోని ఇడి కార్యాలయంలో అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం పాలసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తాను ఎవరి పేర్లను అధికారులకు చెప్పలేదని వెల్లడించారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయాలన్నీ రాజ్ కెసిరెడ్డికి మాత్రమే తెలుసని చెప్పానని వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌లలోని వివరాలను ఇడి అధికారులు సేకరించారని తెలిపారు.
లోపల ప్రశ్నలు, విచారణలు పెద్దగా ఏమీ జరగలేదని పేర్కొన్నారు.తన ఫోన్‌లోని డేటా ట్రాన్స్ ఫర్ కోసం పిలిచినట్లు చెప్పారు. వారికి అవసరమైన సమాచారం తన ఫోన్‌లో ఉంటుందనే ఉద్దేశంతో ఆ డేటాను తీసుకున్నట్లు చెప్పారు. సిట్ అధికారులకైనా, ఇడి అధికారులకైనా తాను ఇదే విషయం చెప్పానన్నారు. తనను ఎవరు లక్ష్యంగా చేసుకున్నా భయపడే వ్యక్తిని కాదని వ్యాఖ్యానించారు. తిరుమల వెంకన్న సాక్షిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు.


