వారానికి ఒకసారి మండలానికి, గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని అన్నారు. పల్నాడు జిల్లా- వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు మీకు ఆదాయం వస్తుందని, 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం అని, అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో పాల్గొంటానని అన్నారు. విశాఖలో చెత్త నుంచి కరెంటు తయారు చేస్తున్నారని, మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేస్తామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాష్ట్రంలో బ్యాన్ చేశామని చెప్పారు. మార్చి 31 కల్లా వందశాతం ఇంటినుంచి చెత్త సేకరించేలా చేస్తామని, చెత్త ద్వారా మళ్లీ వస్తువుల ఉత్పత్తులు చేస్తామని సిఎం పేర్కొన్నారు.
టెక్నాలజీ వినియోగంలో మనమే నెంబర్ వన్ అని, వ్యవసాయంలోనూ ఎఐ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఎన్ డిఎ కూటమి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురాబోతుందని, సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని తెలియజేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని, స్త్రీశక్తి, దీపం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. పేదల ఆదాయం పెంచేందుకు పి4 పథకం ఉందని, టెక్నాలజీ వినియోగాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మెచ్చుకున్నారని అన్నారు. పల్నాడు అంటే పౌరుషాల గడ్డ అని, పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయని, శివరాత్రి అంటే కోటప్పకొండ ప్రభలు ప్రత్యేకం అని కొనియాడారు. ఎఐ సదస్సులో కాంగ్రెస్ తీరు ఆవవేదన కలిగించిందని, కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదని సూచించారు. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించాలని, దేశానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు. కొందరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని, తప్పులు చేసిన వాళ్లు అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీలో తన సతీమణిని కూడా అవమానించారని, 23 క్లేమోర్ మైన్స్ ప్రయోగించినా తాను భయపడనని అన్నారు. వెంకటేశ్వరస్వామి స్వయంగా తనను కాపాడారని, వెంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని, నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై నెపం నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య చుట్టూ నాటకాల రాయుడు నాటకాలు ఆడారని, ఇప్పుడు కూడా లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ప్రాణం పోయినా తప్పు చేయనని, లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని తెలిపారు. తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, తప్పును పక్కన వాళ్లపై నెట్టే నీచులు కూడా ఉన్నారని, నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని తెలిపారు.


