అసెంబ్లీ లో అందరూ ఉంటేనే మసాలా ఉంటుందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తన ఛాంబర్‌లో స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసమే ఎమ్మెల్యేలు ఎన్నికవుతారని, అలాంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన అసెంబ్లీకి గైర్హాజరు సబబు కాదని అన్నారు. వైసీపీలో జగన్ మోహన్ రెడ్డి మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ గుర్తు చేశారు. వైసీపీ సభ్యులకు నోటీసులు ఇవ్వాలంటే తగిన సమయం రావాలన్నారు.
అనర్హత వేటు అంశం ఆంధ్రప్రదేశ్‌లో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా సక్సెస్ అవుతుందని అన్నారు. గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వచ్చినా అది హాజరుగా పరిగణించాలనే నిబంధన ఎక్కడ ఉందో నెంబర్ వన్ స్టూడెంట్ అని చెప్పుకునేవాళ్లు చూపించాలని సవాల్ విసిరారు. గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వస్తే, అది హాజరుగా పరిగణించబడదని స్పష్టం చేశారు. అడ్డగోలు వాదనలు చేసే వారిని ఏమనాలని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి దక్కాల్సిన అన్ని గౌరవ మర్యాదలు లభిస్తున్నాయని అన్నారు.


