పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు మిస్సైల్‌లు, డ్రోన్‌లతో ఇరాన్ పై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ తనచుట్టూ ఉన్న దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన, ఇజ్రాయెల్‌పైన భీకర దాడులు చేస్తున్నది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్, బ్రిటన్ కు తీవ్రమైన హెచ్చరికలు చేసింది. తమపై దాడుల కోసం అమెరికా దళాలకు బ్రిటన్ తన సైనిక స్థావరాలను ఉపయోగించుకునే అవకాశం ఇస్తుందనే వార్తల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ వివాదంలో బ్రిటన్ జోక్యం శ్రుతి మించితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న ఈ యుద్ధంలో భాగం కావాలని బ్రిటన్ ప్రజల్లో అధిక శాతం మంది కోరుకోవడం లేదు. కానీ వారి ప్రధాని స్టార్మర్ మాత్రం సొంత ప్రజల అభిప్రాయాన్ని విస్మరించి, ఇరాన్‌పై దాడికి యూకే స్థావరాలను వినియోగించుకునే అవకాశం ఇస్తున్నారు. తద్వారా ఆయన బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవడానికి ఇరాన్ వెనుకాడదు అని అరాఘ్చీ స్పష్టం చేశారు. ఈ వివాదం తమది కాకపోయినా బ్రిటన్ అనవసరంగా తలదూరుస్తోందని పరోక్షంగా మండిపడ్డారు.


