మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా సీన్‌బామ్ నడిరోడ్డుపై లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. మిచొకాన్‌లో ప్రజలతో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి బహిరంగంగా తాకుతూ ఆమెను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దేశ అధ్యక్షురాలు నడిరోడ్డుపై లైంగిక వేధింపులు ఎదుర్కోవడం కలకలం సృష్టించింది.
ఈ ఘటనపై క్లాడియా తాజాగా స్పందించారు. ఈ మేరకు తనపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు పెట్టారు. ఈ ఘటన మెక్సికోలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. పురుషాధిక్యత, లైంగిక వేధింపులతో దేశంలోని మహిళలు ఇప్పటికీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు దేశ అధ్యక్షురాలైన నాకే ఇలా జరిగితే, మన దేశంలోని యువతుల పరిస్థితి ఏంటి? మహిళల వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఏ వ్యక్తికీ లేదు అని క్లాడియా పేర్కొన్నారు.


