తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఆ నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశమే లేదన్నారు. దేశ రాజధాని నుంచి తాము నిధులు తెస్తుంటే, కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ సొమ్మును ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పంపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని నడుపుకోవడానికి తెలంగాణ సొమ్మును వినియోగిస్తున్నారని ఆరోపించారు.
డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం మోదీ హైదరాబాద్ వస్తున్నారని వివరించారు. తమ నినాదం జై శ్రీరాం, జై తెలంగాణతోపాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే అని స్పష్టం చేశారు. జై శ్రీరాం జై తెలంగాణ నినాదాలతో పరేడ్ బహిరంగ సభ దద్దరిల్లుతుందని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాదిరిగా తనకు దోచుకోవడం తెలియదన్నారు. రైతులకు బేడీలు వేసి అరిగోస పెట్టడం తనకు తెలియదని చెప్పారు. డ్రగ్స్ తీసుకోవడం కూడా తమకు తెలియదని పేర్కొన్నారు.


