టిడిపి ఎమ్మెల్యేలు సీరియస్ గా లేకపోతే ఇబ్బందులేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలోనూ భేటీకి కొంతమంది రాలేదని అన్నారు. సర్ వర్క్ షాపు కు హాజరు కాని కొంతమంది ఎమ్మెల్యేలు రాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఆ రోజే సీరియస్ గా చెప్పానని, కానీ కొంతమంది లో మార్పు రాలేదని, కీలక సమావేశాలకు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇక ఇటువంటి అంశాల్లో సీరియస్ గా ఉంటానని హెచ్చరించారు. అన్ని స్థాయిల్లో సమన్వయం కమిటీల నియామకం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకు వెళ్లాలని, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అధికారంలో కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. పని చేయకపోతే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తానని, ఎమ్మెల్యేలు ఎక్కడా నోరు పారేసుకోవద్దు అని హెచ్చరించారు.
పవర్ ఆఫ్ సైకిల్ చాటేందుకే నెలలో కొన్ని రోజులు, తాను సైకిల్ పై వివిధ కార్యక్రమాలకు వెళ్తానని, పవర్ ఆఫ్ సైకిల్ చూపించాలంటే ప్రతీ ఒక్కరూ ఎలక్ట్రిక్ సైకిల్ వాడండని, ఎలక్ట్రిక్ సైకిల్ వల్ల ఖర్చు సున్నా, ఆరోగ్యానికి ఆరోగ్యం అని సూచించారు. ఎలక్ట్రిక్ సైకిల్ పై వీలైనన్నిఎక్కువ ఇళ్లకు తిరుగుదామని, ఈ నెల 4న ఎన్ డిఎ భేటీలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. 2024 లో కూటమికి వచ్చిన ఓటర్లకంటే వచ్చే ఎన్నికల్లో పెరగాలని, ప్రతీ బుధవారం పార్టీ క్యాలెండర్ తప్పనిసరిగా అమలు కావాలని అన్నారు. జులై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం అని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలని, 45 రోజుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. ఇంటింటి ప్రచారంలో తాను పాల్గొంటానని, వీలుంటే ఈ-సైకిళ్లపై ప్రచారం చేపట్టాలని చెప్పారు. తాను కూడా సైకిల్ మీదే ప్రచారం చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.


