సుదీర్ఘకాలంగా చర్చల దశలో ఉన్న భారత్-అమెరికా ప్రతిష్ఠాత్మక వాణిజ్య ఒప్పందం తుదిదశకు చేరుకుంది. వచ్చే జూలైలో ఈ ఒప్పందానికి సంబంధించిన మొదటి విడత ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఇటీవలి కాలంలో పన్నుల విషయంలో ఇరుదేశాల మధ్య స్వల్ప వివాదం తలెత్తినప్పటికీ చర్చలు మాత్రం వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకుంటూ, పరస్పర మార్కెట్ భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడమే ఈ ద్వైపాక్షిక ఒప్పందం ముఖ్య ఉద్దేశమని గోయల్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరనుంది.
గత కొన్ని వారాలుగా ఇరుదేశాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు ఊపందుకున్నాయని, అందరూ ఊహించిన దానికంటే ముందే ఒక మంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ధీమా వ్యక్తంచేశారు. అంతకుముందు జూన్ 5న ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అమెరికా వాణిజ్య విభాగానికి చెందిన పూర్తిస్థాయి బృందం పాల్గొందని గోయల్ గుర్తుచేశారు. ఆ భేటీలోనే ఒప్పందానికి అడ్డంకిగా ఉన్న చాలా అంశాలపై ఒక స్పష్టత వచ్చిందన్నారు. జూలై మధ్య నాటికి ఇరుదేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసేలా మొదటి విడత ఒప్పందాన్ని అమలుచేసే స్థితికి చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

































