అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ పొరుగునే ఉన్న గల్ఫ్ దేశాలకు ఇరాన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ శతృదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌లకు తమ దేశాల్లో చోటు ఇవ్వొద్దని సూచించింది. గల్ఫ్ దేశాల్లో అమెరికా మిలిటరీ స్థావరాలు ఏర్పాటు చేసుకుని, అక్కడ్నుంచి ఇరాన్‌పై దాడిచేస్తోంది. అందువల్ల తమ దేశంపై దాడి చేసేందుకు అనువుగా అమెరికా సహా ఏ దేశానికి స్థలం ఇవ్వొద్దని ఇరాన్ కోరింది.
ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఒక ప్రకటన చేశారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, కువైట్, ఖతార్ దేశాలు ఈ ప్రాంతంలో అభివృద్ధి, రక్షణ కోరుకుంటే తమ శతృదేశాల సైన్యాన్ని వారి భూభాగంలోకి అనుమతించకూడదని సూచించారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ స్పందించారు. మేం ముందుగా ఏ దేశంపైనా దాడి చేయబోమని ఎన్నోసార్లు చెప్పాం. మా ఆర్థిక మూలాలు, నిర్మాణాలపై దాడి జరిగినప్పుడు మాత్రమే మేం ఎదురుదాడి చేస్తాం. ఈ ప్రాంతంలోని పొరుగు దేశాలకు చెప్పేదేంటంటే, శతృవులు మాపై యుద్ధానికి మీ నేలను వాడుకోనివ్వకండి. అలా చేస్తే శతృస్థావరాలు భూస్థాపితం అయ్యేవరకు మేం దాడులు చేస్తూనే ఉంటాం. వారికి సహకరించిన వారిని కూడా వదలబోం అని ఆయన పేర్కొన్నారు.


