భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌ను లాంఛ్ చేయనుంది. ఏపీలోని శ్రీహరి కోటలోని లాంచింగ్ ప్యాడ్ నుంచి 12న ఉదయం 10.17 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ రాకెట్ ద్వారా డీఆర్డీవో రూపొందించిన ఈఓఎస్-ఎన్1 శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తితిదే అధికారులు ఇస్రో చీఫ్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.


