భారత పాస్పోర్టు ఉన్నంత మాత్రాన భారతీయ పౌరసత్వం ఉన్నట్టు కాదని, అది సదరు వ్యక్తులు విదేశాలకు ప్రయాణించేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది. 14వ పాస్పోర్టు సేవాదినం నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. భారత పౌరులకు మాత్రమే భారత పాస్పోర్టు జారీ చేసినప్పటికీ, అది పౌరసత్వానికి సంబంధించి తుది నిర్ధారణ పత్రం కాదని వెల్లడించింది. నిజానికి ఆధార్ గానీ, ఓటర్ ఐడీ కార్డుగానీ కేవలం గుర్తింపు పత్రాలే తప్ప, అవి పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కాదని కేంద్ర ప్రభుత్వం, కోర్టులు గతంలోనే స్పష్టం చేశాయి. ఇప్పుడు పాస్పోర్టు అంశంలోనూ అదే తరహా ప్రకటనతో, అసలు భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించే ధ్రువపత్రాలు ఏమిటనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాస్పోర్టు పొందినంత మాత్రాన అది సదరు వ్యక్తికి సంబంధించినది కాదని విదేశాంగ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పాస్పోర్టు వెనకాల ఇది భారత ప్రభుత్వ ఆస్తి అని స్పష్టంగా ఉంటుందని, ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా దాన్ని అప్పగించాల్సిందేనని పేర్కొంటున్నాయి. పాస్పోర్టు ఉన్నంత మాత్రాన సదరు వ్యక్తి భారతీయ పౌరుడేనని ధ్రువీకరించినట్టు కాదని చెబుతున్నాయి.

































