తమిళనాడులో ప్రతిపక్షమైన డీఎంకేకు మిత్రపక్షాలు వరుసగా షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ముగింపు పలికింది. డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే భారీ విజయం సాధించడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించింది. దీంతో పలు పార్టీలు తమ వ్యూహాలను, పొత్తులను మార్చుకున్నాయి.
కాగా, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమితో కలిసి పోటీ చేసిన ఐయూఎంఎల్ రెండు స్థానాలు గెలుచుకున్నది. అయితే, ఎన్నికల అనంతరం సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి ఆ పార్టీ మద్దతు ఇచ్చింది. అధికార కూటమిలో చేరడంతో పాటు, రాష్ట్ర మంత్రివర్గంలోనూ ప్రాతినిధ్యాన్ని దక్కించుకుంది. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే కూటమిని వీడటంపై రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఐయూఎంఎల్ నిర్ణయం తీసుకున్నది. డీఎంకేతో 60 ఏళ్ల రాజకీయ బంధాన్ని తెంచుకుంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

































