మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో పార్థసారథి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని భక్షించే వారే హిందూ ధర్మ రక్ష అని సాక్షి పత్రికలో ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. పండుగల సమయంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకోకుండా, కేవలం జగన్ బాగుండాలని మాత్రమే కోరుకోవడమే వైసీపీ నైజమని ఆరోపించారు. గత ఐదేళ్లలో హిందూ సంప్రదాయాలను గౌరవించిన దాఖలాలు లేవని, కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి ఆరోపించారు.
జగన్ ఆలయాలకు వెళ్లకుండా ఇంట్లోనే సెట్టింగ్లు వేసి పూజలు చేస్తున్నట్లు నటించడం అలవాటుగా మారిందని విమర్శించారు. అబ్దుల్ కలాం వంటి మహానుభావులు సంప్రదాయాలను గౌరవించి డిక్లరేషన్ ఇచ్చారని, కానీ జగన్ ఎప్పుడూ ఆ పని చేయలేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, యువత ఉపాధి విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో గ్రాడ్యుయేట్ నిరుద్యోగం 24 శాతానికి చేరి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.


