భారత మామిడి ఎగుమతిదారులకు జపాన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ సీజన్‌కుగాను భారత మామిడి పండ్ల దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ లోని క్రిమిసంహారక కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని జపాన్ తనిఖీ బృందం గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ పరిణామంతో మామిడి ఎగుమతిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని రెహ్మాన్‌పూర్‌లో ఉన్న ఒక ప్లాంట్‌లో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు జపాన్ అధికారులు గుర్తించారు. పండ్లను తెగుళ్లు, కీటకాల నుంచి రక్షించడానికి ఈ ప్రక్రియ చాలా కీలకం. ఈ నేపథ్యంలో మార్చి 2 తర్వాత జారీ చేసిన భారతీయ సర్టిఫికెట్లతో వచ్చే మామిడి షిప్‌మెంట్‌లను అంగీకరించబోమని జపాన్‌కు చెందిన యొకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ స్పష్టంచేసింది. ఈ నిషేధం కారణంగా కేసర్, అల్ఫాన్సో, లంగ్రా, బంగినపల్లి వంటి ప్రసిద్ధ రకాల ఎగుమతులు నిలిచిపోయాయి.


