జపాన్ ప్రధాని సనాయే తకైచి ఇండియాలో పర్యటించనున్నారు. ఆమె జూలై 1 నుంచి 3 వరకు ఇండియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అవుతారు. జపాన్, ఇండియా మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార, సాంకేతిక సంబంధాల పురోగతి కోసం చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 2022 మార్చిలో జరిగిన ఇండియా-జపాన్ సదస్సు తర్వాత జపాన్ ప్రధాని ఇండియా రాబోతుండటం ఇదే తొలిసారి. జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తకైచి కూడా ఇండియాలో పర్యటించనుండటం కూడా ఇదే మొదటిసారి.ఈ మూడు రోజుల పర్యటన సందర్భంగా తకైచి, ప్రధాని మోదీతో ఉన్నతస్థాయి చర్చలు జరిపి, ఇరు దేశాల మధ్య సహకారం, సమన్వయంపై ఒప్పందం కుదుర్చుకుంటారు. అనంతరం మోదీ తో కలిసి ఇండియా-జపాన్ దేశాల సంయుక్త ఆర్థిక సదస్సులో పాల్గొంటారు.
ఈ సదస్సులో భారత్, జపాన్‌లకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై చర్చిస్తారు. ఇండియా-జపాన్ మధ్య కొంతకాలంగా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ముఖ్యంగా 2014 నుంచి ఇరు దేశాలు ప్రపంచ వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. గత ఏడాది ఆగష్టులో ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటించారు. రాబోయే దశాబ్దకాలంపాటు ఇరు దేశాలు ఎలా కలిసి పని చేయాలనే అంశంపై అవగాహనకు వచ్చారు.

































