డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి కీలక వడ్డీ రేట్లు తగ్గించాలని తమ కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ కు చెబుతూ వస్తున్నారు. కానీ ఫెడ్ రిజర్వ్ ప్రస్తుత ఛైర్మన్ జెరోమ్ పావెల్ అంతగా పట్టించుకోలేదు. ఈ ఏడాది మే నెలలో పావెల్ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో కొత్త గవర్నర్‌గా కెవిన్ వార్ష్ ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే 2017లో పావెల్‌ను నామినేట్ చేసింది కూడా ట్రంపే కావడం గమనార్హం. కెవిన్ వార్ష్ 2006-11 మధ్య ఫెడ్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఆయన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, అధిక వడ్డీ రేట్లకే మద్దతు ఇచ్చేవారు. తక్కువ వడ్డీ రేట్ల విధానాన్ని వ్యతిరేకించారు. 2008-09 మహా మాంద్యం సమయంలో ఫెడ్ విధానాలను ఆయన ఒప్పుకోలేదు. అప్పట్లో ఫెడ్ బోర్డు సభ్యుడిగా ఎంపికైన అతి తక్కువ వయసున్న (35) వ్యక్తిగా వార్ష్ నిలిచారు. ఇటీవలి కాలంలో తక్కువ వడ్డీ రేట్లకు మద్దతు పలకడం, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టాక ఆయన విధానాలకు వార్ష్ మద్దతివ్వడమే తాజా ఎంపికకు కారణంగా చెబుతున్నారు.


