బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) బృందం కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2వ తేదీల్లో అమెరికా మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానించింది. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను కేటీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా అమెరికాలోని భారతీయుల పరిస్థితులు, రాజకీయాలపై చర్చించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా పాల్గొన్నారు. ఆటా మహా సభలకు హాజరయ్యేందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.


