ప్రముఖ నటి శారదకు అరుదైన గౌరవం దక్కింది. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన అమూల్యమైన సేవలను గుర్తించిన కేరళ ప్రభుత్వం, రాష్ట్రంలోని అత్యున్నత సినీ పురస్కారమైన జేసీ డేనియల్ అవార్డుఉ2024కు శారదను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ వెల్లడించింది. జేసీ డేనియల్ అవార్డు అనేది కేరళలో సినిమారంగంలో జీవితకాల సేవలకు అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం. ఈ అవార్డు కింద శారదకు రూ.5 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేయనున్నారు.
జనవరి 25న తిరువనంతపురంలో నిర్వహించనున్న కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా శారద ఈ గౌరవాన్ని స్వీకరించనున్నారు. ఈ పురస్కారానికి ఎంపిక చేసే కమిటీలో ప్రముఖ నటి ఊర్వశి, ప్రముఖ నిర్మాత బాలు కిరియత్ సభ్యులుగా ఉన్నారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ కార్యదర్శి సి. అజోయ్ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించారు. కమిటీ ఏకగ్రీవంగా శారద పేరును సిఫారసు చేయడం ఆమె సినీ ప్రస్థానానికి లభించిన గౌరవంగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శారద 1945 జూన్ 25న ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి పట్టణంలో జన్మించారు. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సత్యవాణి దేవి. శారద అసలు పేరు సరస్వతీ దేవి.


