2026 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన సూర్యకుమార్ నేతృత్వంలోని భారత బృందాన్ని (బీసీసీఐ) సన్మానించనున్నది. ఆదివారం జరిగే నమన్ అవార్డు ప్రదానోత్సవంలో సన్మాన కార్యక్రమం ఉండనున్నది. ఇటీవల ఐసీసీ టోర్నీల్లో అయిదు టైటిళ్లు గెలిచిన భారత జట్లను నమన్ అవార్డులతో సన్మానించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది. మార్చి 8వ తేదీన జరిగిన ఫైనల్లో సూర్య కుమార్ నేతృత్వంలోని భారత జట్టు టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సూర్య బృందంతో పాటు 2025లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన మహిళల జట్టు, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పురుషుల జట్టు, 2026 అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు, 2025 మహిళ అండర్19 వరల్డ్‌కప్ బృందాలను కూడా సత్కరించనున్నారు.
అనేక మంది క్రికెటర్లకు వ్యక్తిగత అవార్డలను కూడా ఇవ్వనున్నది. టెస్టు, వన్డే కెప్టెన్ గిల్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డును ఇవ్వనున్నారు. మహిళల్లో బెస్ట్ ఇంటర్నేషన్ క్రికెటర్ అవార్డును స్మృతీ మంధానాకు ఇవ్వనున్నారు. మాజీ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్‌కు .. కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నారు. ఇక బీసీసీఐ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అందుకోనున్నారు. 1983లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడిగా ఉన్నారు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్నారు. అయితే 2022 నుంచి 2025 వరకు రోజర్ బిన్నీ కోచ్, సెలెక్టర్, బీసీసీఐ అధ్యక్షుడిగా చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 24వేల రన్స్ చేసిన క్రికెటర్‌గా ద్రావిడ్‌కు గుర్తింపు ఉన్నది. 2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో భారత జట్టు కోచ్‌గా ద్రావిడ్ ఉన్నారు.


