పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరసగా షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో మొదలు, రెబెల్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న మమత ఈసారి ఏకంగా పార్టీ అధ్యక్షురాలి పదవిని కోల్పోయింది. రెబెల్ ఎమ్మెల్యే వర్గం ఆమెను టీఎంసీ అధినేత్రిగా తొలగించింది. మమత స్థానంలో టీఎంసీ నాయకుడిగా సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ ఎంపికయ్యాడు. అంతేకాదు పలువురు సన్నిహితులు సైతం మమతకు దూరమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ పట్టు కోల్పోయింది.

1998లో టీఎంసీని స్థాపించి మూడు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్లో చక్రం తిప్పిన మమత, అనూహ్యంగా పార్టీ చైర్ పర్సన్ పదవికి దూరమయ్యారు. రిటాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు మమతను తమ బాస్‌గా నిరాకరించారు. సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ని టీఎంసీ కొత్త నాయకుడిగా ఎన్నుకున్నారు. అంతేకాదు, తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని రిటాబత్రా వర్గం ప్రకటించింది. అంతటితో సరిపెట్టకుండా మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీగా తప్పించారు.
స్థానిక న్యూ టౌన్‌లోని హోట్‌లో పార్టీ కౌన్సిలర్లతో సమావేశమైన రిటాబత్రా బెనర్జీ, పార్టీలో ఐదేళ్ల అనంతరం సంస్థాగత మార్పులు జరగలేదని, అందుకే రాజ్యాంగబద్ధంగా తాము జాతీయ నాయకత్వాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమతను తృణమూల్ కాంగ్రెస్ చైర్ పర్సన్‌గా తొలగిస్తూ, హౌరా సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అరూప్ రాయ్‌కు పగ్గాలు అప్పగించారు. అయితే మమత సన్నిహితులు కొందరు మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కామెడీ షోగా అభివర్ణించారు.


































