మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఉప్పరపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును కోర్టు వాయిదా వేసింది. ఉప్పరపల్లి కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో ముగ్గురు నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకెళ్లారు. ఈ డ్రగ్స్ కేసులో లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో ఈ నిందితులను మరో 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. మరోవైపు పోలీసుల కస్టడీకి పూర్తిగా సహకరించారని, వారికి బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే నిందితులను రెండు సార్లు పోలీసులు కస్టడీకి తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల మరోసారి కస్టడీకి అవసరం లేదని కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ఉప్పరపల్లి కోర్టు, తీర్పును రేపటికి వాయిదా వేసింది.


