న్యూఢిల్లీ వేదికగా జరిగిన మెగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్ కు ఆమోదం తెలిపారు. భారత్ సహా 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు దీనికి మద్దతు తెలిపాయి. ఇది ప్రపంచ ఏకాభిప్రాయానికి నిదర్శనంగా నిలిచింది. ఆర్థికవృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఈ డిక్లరేషన్ ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తోంది. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ (అందరి సంక్షేమం, అందరి ఆనందం) అనే భారతీయ తాత్విక సూత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ డిక్లరేషన్‌ను రూపొందించారు. ఏఐ ద్వారా లభించే ప్రయోజనాలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సమానంగా అందాలనే ఆశయాన్ని ఇది పునరుద్ఘాటించింది.
వసుధైవ కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే భావనతో అన్ని దేశాలు తమ పౌరుల ప్రయోజనాల కోసం ఏఐని అభివృద్ధి చేసి, వినియోగించుకునేలా వనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రాముఖ్యతను ఈ తీర్మానం నొక్కి చెప్పింది. అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, అన్ని భాగస్వామ్య పక్షాలను కలుపుకొనిపోవడం, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం, విశ్వసనీయమైన ఫ్రేమ్‌వర్క్‌ల ద్వారా ఏఐ పురోగతిని ప్రోత్సహించడం లాంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు.


