అమెరికా కొత్తగా నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్ ను రూపొందిస్తున్నది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పనులు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల జాబితాను రూపొందించాలనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం కూడా చేశారు. ఈ ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్‌పై మరిన్ని ఆంక్షలు విధించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్టు రూపకల్పనలో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి ప్రతి రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల జాబితాను తయారుచేయనుంది. ట్రంప్ తాజా ఉత్తర్వుల ప్రకారం బ్యాలెట్లను ట్రాక్ చేయడానికి ప్రత్యేకమైన బార్‌కోడ్‌లు ఉన్న సురక్షితమైన ఎన్వలప్‌లు ఉండేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రాలు ఆమోదించిన ఓటర్ల జాబితాలో లేని వారికి యూఎస్ పోస్టల్ సర్వీస్ ఆబ్సెంటి బ్యాలెట్లను పంపకుండా నిరోధించే ఆలోచన చేస్తున్నారు.మెయిల్-ఇన్ ఓటింగ్‌ను సైతం ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. అయితే రాష్ట్రాలు నిర్వహించుకునే ఎన్నికల్లో దేశాధ్యక్షుడు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందున అమెరికా ప్రభుత్వం చట్టపరంగా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


