పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కు ఆమోదం కోసం తాము ఎంతగానో ప్రయత్నించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వారణాసి లో జరిగిన ఓ సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ లాంటి ప్రతిపక్ష పార్టీల నీచ రాజకీయాలవల్లే ఆ చట్టం అమల్లోకి రాకుండా ఆగిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలు అభివృద్ధి చెందడం, అసెంబ్లీలు, పార్లమెంట్‌కు రావడం ప్రతిపక్షాలకు ఇష్టంలేదని వ్యాఖ్యానించారు. అందుకే 40 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డుకుంటూనే ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నాయని ప్రధాని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మహిళా రిజర్వేషన్‌లను అమలు చేయడానికి తాము కృషి చేస్తూనే ఉంటామని చెప్పారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయడమనే మహా యజ్ఞాన్ని మొదలు పెట్టేందుకు తాము సిద్ధమవుతున్నామని అన్నారు. అందుకోసం మాతృమూర్తుల ఆశీస్సులు తీసుకునేందుకు వారణాసి వచ్చానని ప్రధాని చెప్పారు. ఈ బిల్లును తేవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు.


