హర్మూజ్ జలసంధి లో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్రం అత్యవసర అడ్వయిజరీ జారీచేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా నౌకల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటన విడుదలచేసింది. భద్రతాకారణాల దృష్ట్యా ఇరాన్ దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన భారత నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించింది.
ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని కోరింది. నౌకలలో ఉన్న నావికులు వాటిలోనే ఉండాలని పేర్కొన్నది. అప్రమత్తంగా ఉంటూ, అధికారులు జారీచేసే సూచనలను పాటించాలని కోరింది. కంపెనీ ప్రతినిధులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలని సూచించింది. దాదాపు 40 రోజుల భీకర దాడుల తర్వాత ఇరాన్-అమెరికా మధ్య రెండు రోజుల క్రితం రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తొలగిపోలేదు.అయితే ఇంతలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఇరాన్ హర్మూజ్‌ను మరోసారి మూసివేసింది. దాంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా తయారైంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ భారత నావికులకు అడ్వయిజరీ జారీచేసింది.


