ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్లు చెల్లవని ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం సుంకాలను విధించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు.
ప్రపంచ దేశాలపై సుంకాలకు సంబంధించి అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ట్రంప్ తప్పుబట్టారు. అత్యంత ఆమోదయోగ్యమైన పద్ధతిలో మేం విధించిన టారిఫ్లను సుప్రీంకోర్టులో కొందరు వ్యతిరేకించారని, న్యాయమూర్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇందుకు వారు సిగ్గుపడాలి అంటూ విరుచుకుపడ్డారు. ఇది చాలా హాస్యా్స్పదకరమైన తీర్పు అని అన్నారు. ఇక టారిఫ్లకు సంబంధించిన సర్దుబాటు ప్రక్రియ మొదలైందని వెల్లడించారు. గతంలో తీసుకున్న దానికంటే ఎక్కువ వసూలు చేసేందుకు సాధ్యమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశ ఆదాయాన్ని పెంచేందుకు మరింత శక్తివంతమైన మార్గలెన్నో తమకు అందుబాటులో ఉన్నాయని, ఇకపై మరిన్ని టారిఫ్లను విధించగలనని చెప్పారు. ఈ క్రమంలోనే 10 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.


