బాల్క సుమన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత కోపమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో బాల్క సుమన్ కలిసేందుకు కెటిఆర్, చంచల్ గూడ జైలుకు వెళ్లారు.బాల్క సుమన్ తో ములాఖత్ అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్‌పై 220 కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తగలబెట్టాలని మాట్లాడితే చర్యలు ఉండవా?. మాజీ ఎమ్మెల్యే సిద్దిపేటలో హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడిచేస్తే శిక్షార్హం కాదా. జడ్చర్ల ఎమ్మెల్యే అక్కడి కంపెనీని తగలబెడతా అంటే చర్యలు ఉండవా? కాంగ్రెస్ నేతలకు ఒక నీతి, బాల్క సుమన్‌కు ఒక నీతి ఉంటుందా? సిఎం రేవంత్ రెడ్డి అన్యాయాలపై నిలదీస్తూనే ఉంటా అని కెటిఆర్ అన్నారు.


