తెలుగుదేశం పార్టీ తెలంగాణకు కార్యకర్త వి.శ్రీశైలానికి ఎన్నారై తెలుగుదేశం కువైట్ సాయంగా నిలిచింది. తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్త వి.శ్రీశైలం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ఎన్నారై టీడీపీ కువైట్ నాయకుల దృష్టికి వచ్చింది. సోషల్ మీడియాలో పార్టీకి చురుగ్గా సేవలు అందిస్తున్న శ్రీశైలం క్యాన్సర్ బారిన పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకరరావు, ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్‌మెంట్ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు, వారి కార్యవర్గం స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్భాట వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన వారు, ఆ ఖర్చులను సేవా కార్యక్రమానికి మళ్లించారు. ఈ సందర్భంగా శ్రీశైలం వైద్య చికిత్స కోసం రూ.1,21,900లు ఆర్థిక సహాయం అందించారు. ఒక కార్యకర్త ఆరోగ్యం కోసం సహాయం చేయడం నిజంగా సంతోషకరమని ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకరరావు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేవుడి దయతో శ్రీశైలం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీశైలం వంటి సోషల్ మీడియా కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్‌మెంట్ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ పార్టీకి సేవలందించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కుదరవల్లి సుధాకరరావు, మద్దిన ఈశ్వర్ నాయుడు, రషీద్ భేగం, బిల్లా రమేశ్ యాదవ్, కుసుమే కుటుంబరావు, ఈడుపుగంటి దుర్గాప్రసాద్, షేక్ బాషా, సుబ్బారావు, వీసీ సుబ్బారెడ్డి, కొల్లి ఆంజనేయులు, గాజులపల్లి సుబ్బారెడ్డి, మహ్మద్, లాస్య మొబైల్స్ అధినేత వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


