రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడమే తమ తొలి ప్రాధాన్యమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రిపీటెడ్‌గా డ్రగ్స్ కేసులో పట్టుబడితే పీడీ యాక్ట్ తరహా చట్టాన్ని ఉపయోగిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈగల్ ఫోర్స్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. నార్కోటిక్స్‌పై అలర్ట్‌గా ఉన్నామని, డ్రగ్స్ కట్టడి చేయడంలో మొదటి ప్రాధాన్యతతో ఉన్నామన్నారు. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆపరేషన్‌పై ఈ సమీక్షలో చర్చించామని వివరించారు. ఈగల్ ఫోర్స్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఆపరేషన్‌లు నిర్వహించడం ద్వారా నిందితులను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. డ్రగ్స్ విషయంలో సరఫరాతోపాటు డిమాండ్.. ఈ రెండింటిపై దృష్టి సారించామని పేర్కొన్నారు.


