మహిళా బిల్లు వీగిపోవడం బిజెపి విధానాల ఓటమిగా భావిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లు పేరుతో డీలిమేషన్ బిల్లు తీసుకు వచ్చిందని అన్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ధి ఉందని తెలియజేశారు. మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్రమోడీకి నిజాయితీ లేదని విమర్శించారు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే మద్దతు ఇచ్చేవారని అన్నారు. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చి దక్షిణాదికి అన్యాయం చేసేవారని మండిపడ్డారు. కేంద్రానికి ఆర్థిక వనరులు దక్షిణాది నుంచి అందుతున్నాయని యూపీ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు చేయాలని సూచించారు. 2023 మహిళా రిజర్వేషన్ల బిల్లును యథావిధిగా అమలు చేయాలని, మహిళా రిజర్వేషన్లలోనూ ఎస్సి,ఎస్టి, ఒబిసి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, తప్పుడు చట్టాలు తీసుకువస్తే గల్లీ నుంచి పార్లమెంట్ వరకు నిరసన తెలుపుతామని అన్నారు.
2023 మహిళా బిల్లును పార్లమెంట్ లో పెట్టాలని, 2023 మహిళా బిల్లును పెడితే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చారని, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించట్లేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ పంతాలు, పట్టింపులకు పోవాల్సిన పనిలేదని, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి సవరణ తీసుకువచ్చినా మద్దతు ఇస్తామని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో మరో బిల్లు తీసుకువస్తే గుర్తించి అడ్డుకుంటామని హెచ్చిరించారు.


