నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఈ నెల 10న ఇండియాకు అత్యధిక కాలం పని చేసిన ప్రధానిగా నిలవబోతున్నారు. అది కూడా ఎన్నికల్లో గెలిచి, అత్యధిక రోజులు ప్రధానిగా కొనసాగిన జవహర్ లాల్ నెహ్రూను దాటేయబోతున్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ మే 13, 1952న పదవీ బాధ్యతలు చేపట్టారు. మే 27, 1964న ఆయన మరణించేవరకు ప్రధానిగానే ఉన్నారు. అలా మొత్తం 4,398 రోజులు ప్రధానిగా కొనసాగారు.
ఇంతకాలం పదిలంగా ఉన్న ఈ రికార్డును మోదీ జూన్ 10న చెరిపేయబోతున్నారు. ఈ నెల 10తో మోదీ ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుంటారు. మోదీ మొదటిసారిగా మే 26, 2014న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ప్రధానిగా కొనసాగుతున్నారు. మోదీ ఇంతకుముందు కూడా ప్రధానిగా మరో రికార్డును బద్దలుకొట్టారు. వరుసగా, అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ రికార్డును జూలై 5, 2025న దాటేశారు. ఇందిరాగాంధీ జనవరి 24, 1966న ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి, వరుసగా 4,077 రోజులపాటు కొనసాగారు. ఆమె మార్చి 24, 1977లో వరకు ప్రధానిగా కొనసాగారు. అలా, ఇందిరా గాంధీ కంటే ఎక్కువ రోజులు వరుసగా ప్రధానిగా మోదీ కొనసాగుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.


