పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా రంజాన్, పర్షియన్ నూతన సంవత్స నౌరుజ్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పర్వదినాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు, ప్రపంచ సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ప్రధాని ఖండించారు.
నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగాలని, నౌకామార్గాలు తెరచి ఉంచడం, వాటిని సురక్షితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇరాన్‌లోని భారతీయుల రక్షణకు ఆ దేశం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడటం ఇది రెండోసారి అని చెప్పారు. మార్చి 12న ఓసారి ఫోన్‌లో సంభాషించిన ప్రధాని, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యమార్గాల్లోనే సంక్షోభాలను పరిష్కరించుకోవాలని ఇరాన్ అధ్యక్షుడికి సూచించారు. అనంతరం సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్, మలేసియా, ఫ్రాన్స్ దేశాల అధినేతలతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై వారితో చర్చించారు.


