ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పై తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్య్రానంతరం గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని నెహ్రూ వ్యతిరేకించారని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల కోసం జాతీయ ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టే శక్తులు దేశంలో ఇప్పటికీ ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్ లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1951లో సోమనాథ్ ఆలయ పునఃప్రతిష్ఠ కేవలం ఒక సాధారణ విషయం కాదు. అది భారతదేశ స్వతంత్ర నాగరిక స్పృహకు ప్రతీక అన్నారు. స్వాతంత్య్రానంతరం ఆలయ పునర్నిర్మాణానికి అంకితభావంతో పనిచేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ల సేవలను ప్రధాని కొనియాడారు. దేశంలోని 500కు పైగా సంస్థానాలను ఏకంచేసి ఆధునిక భారతాన్ని నిర్మించిన సర్దార్ పటేల్, సోమనాథ్ పునర్నిర్మాణం ద్వారా మన ప్రాచీన వైభవాన్ని తిరిగి పొందుతున్నామన్న సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చారని మోదీ వివరించారు. అయితే ఈ మహత్కార్యానికి నెహ్రూ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని ఆరోపించారు.


