ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల అధికారిక పర్యటనకు మలేసియా వెళ్తున్నారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 7,8 తేదీలో మలేసియాలో పర్యటించనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. మలేసియాలో మోదీ పర్యటించనుండటం ఇది మూడోసారి. అయితే 2024 ఆగస్టులో ఇరుదేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను కుదుర్చుకున్న తరువాత మలేసియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతే ప్రధాన లక్ష్యంగా మోదీ పర్యటన ఉంటుందని ఎంఈఏ తెలిపింది. ప్రధాని తన పర్యటనలో భాగంగా మలేసియా ప్రధానితో సమావేశమై ఇరుదేశాల మధ్య సహకారంతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. మలేసియాలోని ప్రవాస భారతీయులను కలుసుకుంటారు. పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇండియా-మలేసియా సీఈఓ ఫోరం సమావేశంలోనూ మోదీ పాల్గొంటారు.


