రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. ప్రొటోకాల్ వైఫల్యంపై స్వయంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్ లో అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు సీఎం నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు. తాను ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిన ఆదివాసీ సదస్సుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. అయినప్పటికీ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తనకు ఎటువంటి ద్వేషం లేదని, ఆమె తనకు సోదరితో సమానమని అన్నారు.
9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సులో ప్రసంగించడానికి రాష్ట్రపతి బెంగాల్లోని సిలిగుడికి వెళ్లారు. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి ముఖ్యమంత్రి గానీ, ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు గానీ స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే అధికారికంగా స్వాగతించడానికి ప్రభుత్వం తరపున ఎవరూ రాకపోవడం గమనార్హం.

































