అనేక రాష్ట్రాలు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతుంటే, పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మన్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ (ఆప్) ప్రభుత్వం కొలువై ఉన్న సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వం కొద్ది రోజులుగా ఉచిత, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది.
దీనిలో భాగంగా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని చాలా కాలం నుంచి అమలు చేస్తోంది. ఈ పథకంతో పేదలకు విద్యుత్ ఛార్జీల భారం తప్పిందని ఆప్ అంటోంది. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల విషయంలో ఇంకో కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్లో అన్ని రకాల విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నిర్ణయించింది. గృహ వినియోగానికి యూనిట్‌కు రూ.1.50 పైసలు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు యూనిట్‌కు 79 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌కు 74 పైసలు తగ్గనుండగా.. ఇకపై ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) ఛార్జింగ్‌కు యూనిట్‌కు రూ.5 వసూలు చేస్తారు. ఈ నిర్ణయం వచ్చే నెల 1 నుంచి అమలు కానుంది. దీనిపై పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ విశ్వజీత్ ఖన్నా ఆదేశాలు జారీ చేశారు.


