బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా, దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తూ సరికొత్త మైలురాయిని అధిగమించింది. గతంలో బాహుబలి 2, పుష్ప 2 వంటి చిత్రాలు అన్ని భాషల్లో కలిపి భారీ వసూళ్లు సాధించినప్పటికీ, కేవలం హిందీ వెర్షన్‌లోనే రూ.1000 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన మొదటి భారతీయ చిత్రంగా ధురంధర్ 2 రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది.
ఈ సినిమా విడుదలైన నాటి నుంచే థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ట్రేడ్ అనలిస్టుల అంచనాలను తలకిందులు చేస్తూ, కేవలం 21 రోజుల్లోనే రూ.1041 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే, ఈ చిత్రం ఇప్పటికే రూ.1665 కోట్ల మార్కును దాటి తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. 2025లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ధురంధర్ కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, కథా బలంతో పాటు అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రణ్‌వీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌కు తోడు, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటుల కలయిక సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సారా అర్జున్, రాకేష్ బేడీ తమ నటనతో సినిమాకు వెన్నుముకగా నిలిచారు.


