విద్యార్థి నాయకుడి కిడ్నాప్ కేసులో తదుపరి విచారణ జరిపే వరకు ప్రముఖ సినీ నటుడు ఎం. మోహన్ బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు సీడీని తమ ముందు ఉంచాలని వారికి కోర్టు స్పష్టం చేసింది. విద్యార్థి నాయకుడి కిడ్నాప్‌నకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై నమోదైన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ మేరకు పోలీసులను ఆదేశించింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు యూనివర్సిటీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బోన్సర్లు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో మరో విద్యార్థి సంఘం నేత తిరుపతి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. విద్యార్థి సంఘం నేతల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలను పోలీసులు రక్షించారు. బౌన్సర్లతోపాటు వారి వాహనాలను తిరుపతి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మోహన్ బాబుతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి తొలి వారంలో జరిగింది.


