తమ దేశంపై దాడి చేసిన అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యం అని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని స్పష్టం చేసినట్లు సమాచారం. ఖమేనికి సంబంధించిన వివరాలేవీ తెలియనప్పటికీ, ఆయన మాత్రం ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రస్తుత యుద్ధ సమయంలో అనుసరించాల్సిన విధానంపై జరిగిన ఒక విధానపరమైన సమీక్షా సమావేశం సందర్భంగా ఖమేని ఈ మాటలు చెప్పినట్లు ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఈ సమావేశానికి ఖమేని నేరుగా హాజరయ్యారా, లేదా అనే విషయంలో స్పష్టత లేదు.
ఇరాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యుద్ధం ముదురుతున్న వేళ, రెండు దేశాలతో కాల్పుల విరమణ, ఉద్రిక్తతలు తగ్గించే అంశంపై ఇరాన్ నేతలు ఖమేనితో చర్చలు జరిపారు. ఉద్రిక్తతలు తగ్గించి, శాంతి, కాల్పుల ఒప్పందం వంటి అంశాల్లో రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనల్ని ఇరాన్ నేతలు ఆయన ముందుంచారు. కానీ, ఖమేని మాత్రం వాటిని తిరస్కరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రతీకారమే తమ లక్ష్యమని, తమ దేశ పౌరుల్ని చంపిన వారి నుంచి తగిన పరిహారం పొందాల్సిందే అని ఖమేని స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పరిమిత స్థాయిలోనే ప్రతీకార చర్యలకు దిగామని, అనుకున్నది సాధించేవరకు తమ చర్యలు కొనసాగుతాయని, అంతవరకు ఇది తమ ప్రాధాన్యంగా ఉంటుందని అయన స్పష్టం చేశారు.


